వివేకా మృతి మీద అనుమానాలు…మొఖానికి గాయాలు…హత్య ?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివేక రక్తపు మడుగులో పడివుండటం, తల, చేతిపై బలమైన గాయాలు ఉండటం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. దీనిపై వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇయన ఇంటిని డాగ్‌స్వ్కాడ్ సాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేకానందరెడ్డి పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.మరణం వెనుక అనుమానాలు రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరణానికి కొద్ది గంటల ముందు కూడా ఆయన ప్రజల మధ్య తిరుగుతూ, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి, పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. ప్రజల మధ్య ఉత్సాహంగా కనిపించి, ఇంటికెళ్లి స్నానాల గదిలో విగతజీవిగా కనిపించిన వైఎస్ వివేకా మరణంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఆయన పడివున్న ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించడంతో, డాగ్ స్క్వాడ్ ను రప్పించారు ఉన్నతాధికారులు. బాత్ రూములో ఆయన కాలుజారి పడివుండవచ్చని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలివుండవచ్చని భావిస్తున్నా, పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ 175 కింద అంటే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చేసరికే ఆయన ఇల్లు బంధువులు, కార్యకర్తలతో నిండిపోవడంతో డాగ్ స్క్వాడ్ వల్ల ఉపయోగమేమీ ఉండక పోవచ్చని భావిస్తున్నారు. వివేకా మృతదేహానికి ప్రస్తుతం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు.