వైఎస్ జగన్ ఇంట తీవ్ర విషాదం…జగన్ బాబాయ్ వివేకా హఠాన్మరణం !

ఎన్నికల ముంగిట జగన్ కి పెద్ద దెబ్బే తగిలింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి స్వయానా తమ్ముడు జగన్ కి బాబాయ్ అయిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. 1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1999,2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ లో వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తదనంతర పరిణామాల్లో జగన్ వెంట నడిచారు, మూడేళ్ళ క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లో కాస్త సైలెంట్ అయ్యారు. చాల సౌమ్యునిగా పేరున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాదఛాయలు నింపింది.