కేరళలో జికా వైరస్ కేసులు

కేరళలో జికా వైరస్ కేసులు

కేరళలో జికా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో ముగ్గురికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 18కి చేరింది. ఆదివారం కొత్తగా ఆరోగ్య కార్యకర్త (29) సహా ఓ 22 ఏళ్ల యువకుడు, 46 ఏళ్ల వ్యక్తి జికా వైరస్ బారినపడ్డారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరువనంతపురం, త్రిస్సూర్, కోజికోడ్ మెడికల్ కాలేజీలు, అల్లప్పుజా వైరాలజీ ఇన్ స్టిట్యూట్‌లో నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి వీణా చెప్పారు.

ఆదివారం 35 శాంపిళ్లను పరీక్షించగా ముగ్గురికి వైరస్ నిర్ధారణ అయినట్టు మంత్రి పేర్కొన్నారు పుణే నుంచి 2,100 టెస్టింగ్ కిట్లు వచ్చాయని, వీటిని తిరువనంతపురం 1000, అల్లప్పుజా 500, త్రిస్సూర్, కోజికోడ్‌లకు 300 చొప్పున పంపినట్టు వైద్యాధికారులు చెప్పారు. జ్వరం, దద్దుర్లు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలున్న వారికి జికా వైరస్ పరీక్షలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆరుగురు నిపుణులతో కూడిన కేంద్ర వైద్యుల బృందం జికా వైరస్ పరిశీలన కోసం కేరళలో పర్యటించింది.

తిరువనంతపురం మెడికల్ కాలేజీకి అందజేసినవాటిలో 500 ట్రిపులెక్స్ కిట్లు ఉన్నాయన్నారు. ఈ కిట్‌ల ద్వారా డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్‌లను ఒకేసారి సమాంతరంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. సింగిల్‌ప్లెక్స్ కిట్స్ ద్వారా కేవలం జికా వైరస్‌ను మాత్రమే నిర్ధారించవచ్చని వివరించారు. జికా వైరస్ నిర్దారణ కోసం మరిన్ని ల్యాబొరేటరీలను నెలకొల్పనున్నట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27 ల్యాబొరేటరీల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటిని కూడా ఎన్ఐబీ అనుమతితో జికా నిర్ధారణ పరీక్షలకు వినియోగిస్తామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

జికా అనుమానిత లక్షణాలున్నవారి నమూనాలను సేకరించాలని రాష్ట్ర అధికారులను పుణే నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆదేశించింది. ఆస్పత్రిల్లో రోగులను ముఖ్యంగా గర్బిణీలకు పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కేరళలో మొదటి కేసును 24 ఏళ్ల గర్బిణీలోనే గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, ఆమెకు పుట్టిన బిడ్డకు మాత్రం వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ కాలేదు. దీంతో వైద్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.