జింబాబ్వే సంక్షోభం వెన‌క చైనా హ‌స్తం…

zimbabwe army attacks on robert mugabe because of China

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జింబాబ్వేలో రాబ‌ర్ట్ ముగాబే ప‌రిపాల‌న ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఆయ‌న స్థానంలో కొత్త అధ్య‌క్షుడి ఎంపిక ఖ‌రార‌యింది. స్వాతంత్య్రం వ‌చ్చిన 1980 నుంచి దేశాధ్య‌క్షుడిగా ఉన్న ముగాబే త‌న భార్య గ్రేస్ ను వార‌సురాలిగా చేయాల‌నుకోవ‌డం జింబాబ్వేలో రాజ‌కీయ సంక్షోభానికి దారితీసింది. చ‌డీచ‌ప్పుడు లేకుండా సైన్యం తిరుగుబాటు చేసింది. అయితే ఈ ప‌రిణామం వెన‌క చైనా హ‌స్త‌ముంద‌ని అంత‌ర్జాతీయంగా వార్త‌లొస్తున్నాయి. భార్యను అధ్య‌క్షురాలిగా చేయాల‌న్న ముగాబే ఆలోచ‌న‌పై పార్టీలో అసంతృప్తి ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో చైనా పావులు క‌దిపింది. ఆర్మీ చీఫ్ కాన్ స్టాంటినో చివెంగాను ఉన్న ప‌ళంగా పిలిపించుకుంది. ఈ నెల మొద‌టివారంలో చైనా ప‌ర్య‌ట‌న ముగించుకుని చివెంగా జింబాబ్వేకు తిరిగిరాగానే సైనిక తిరుగుబాటు జ‌రిగింది. దీంతో చైనానే జింబాబ్వే సైన్యాన్ని వెన‌కుండి న‌డిపిస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి.

robert mugabe and his wife

నిజానికి ముగాబేతో చైనాకు స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి. జింబాబ్బే స్వ‌తంత్ర దేశంగా అవ‌తరించిన తొలిరోజుల్లో ఆ దేశానికి ఆయుధాలు అందించ‌డానికి సోవియ‌ట్ ర‌ష్యా నిరాక‌రించ‌డంతో చైనా రంగంలోకి దిగింది. జింబాబ్వేతో స్నేహ‌సంబంధాలు నెల‌కొల్పుకుని ఆ దేశంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. వ్య‌వ‌సాయం, షిప్పింగ్ ఇలా అనేక రంగాలతో పాటు ఆ దేశ కొత్త పార్ల‌మెంట్ నిర్మాణానికి కూడా సహాయ స‌హ‌కారాలు అందించింది. అయితే త‌ర్వాత కాలంలో రెండు దేశాల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. దీంతో ముగాబే చైనాతో ఆయుధాల ఒప్పందాన్ని ర‌ద్దుచేసుకుని ఆయుధాల‌ను తిరిగి పంపించారు. దీంతో ఆగ్ర‌హానికి గురైన చైనా క్ర‌మంగా ర‌క్ష‌ణ సాయాన్ని త‌గ్గిస్తూ వ‌చ్చింది. జింబాబ్వేలో అప్ప‌టికే బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్ట‌డంతో చైనా జాగ్ర‌త్త‌గా పావులు క‌దిపింది. పెట్టుబ‌డులు వెన‌క్కి తీసుకోకుండా… ముగాబే పాల‌న‌పై అసంతృప్తి వ్య‌క్తంచేస్తూ వ‌చ్చింది. ముగాబే గ‌ద్దె దిగిపోవాల‌ని పరోక్ష హెచ్చ‌రిక‌లు చేస్తూ వ‌చ్చింది. అయితే జింబాబ్వేపైనా, పాల‌క పార్టీపైనా ముగాబేకు ప‌ట్టు ఉండ‌డంతో చైనా ఎత్తులు ఇన్నాళ్లూ పార‌లేదు. కానీ భార్య‌ను త‌దుప‌రి అధ్య‌క్షురాలు చేయాల‌ని ఎప్పుడైతే ముగాబే భావించాడో అప్పుడే ఆయ‌న‌కు పార్టీపై ప‌ట్టుత‌ప్పింది. వ‌య‌సు మీద‌ప‌డ‌డంతో పార్టీలోని అసంతృప్తుల‌ను ఆయ‌న దారికి తేలేక‌పోయారు. అద‌ను చూసుకుని చైనా ఆర్మీకి వెన్నుద‌న్నుగా నిలిచి జింబాబ్వేలో రాజ‌కీయ సంక్షోభం సృష్టించింది.