జొమాటో సంచలన నిర్ణయం

జొమాటో సంచలన నిర్ణయం

రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జొమాటో యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలను కంపెనీ ముమ్మరం చేసింది.

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్‌క్రెడ్‌తో జొమాటో 2020లోనే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలను అందజేస్తుంది. ప్రస్తుతం జొమాటో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే రుణాలను అందజేసే అవకాశం ఉంది. కరోనావైరస్  మహమ్మారి ఫుడ్ డెలివరీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది స్థూల సరుకుల విలువలో గణనీయమైన క్షీణతకు దారితీసింది.

రూ.10 కోట్లతో ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. ఇది పూర్తిగా జొమాటో అనుబంధ సంస్థగా ఉండనుంది. కాగా సబ్సీడరీ కంపెనీకి ఏ పేరు పెట్టాలనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని సమాచారం.ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి కంపెనీ పేరు ఖరారు చేయబడుతుందని జొమాటో బిఎస్‌ఇకి ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన యాడ్‌ఆన్‌మో అనే స్టార్టప్‌లో జొమాటో వాటాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అర్భన్‌ పైపర్‌ కంపెనీలో కూడా 5 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇప్పటికే షిస్‌రాకెట్‌, సామ్‌సెట్‌ టెక్నాలజీస్‌, క్యూర్‌ ఫిట్‌ వంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసింది.