Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భాజపార్టీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్జియా బాలీవుడ్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమను బాలీవుడ్ అని పిలవరాదని.. ఆ పేరును మార్చేయాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కి లేఖ రాశారు. ఈ పేరును తొలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఇటీవల ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ కలవడానికి వచ్చారని, ఆయనతో మాట్లాడుతోన్న సమయంలో బాలీవుడ్ ప్రస్తావన వచ్చిందని, అప్పట్లో బాలీవుడ్ పేరును బీబీసీ మీడియా వాళ్లు తొలిసారిగా ప్రచారం చేసినట్లు తనకు తెలిపారని అన్నారు.
హాలీవుడ్ సినిమాలను హిందీ పరిశ్రమ కాపీ కొట్టి చిత్రాలు తీస్తుందన్న భావనతో ఈ పేరు పెట్టారన్నారు. ఈ పేరు వాడితే మనల్ని మనం కించపరుచుకున్నట్లేనని అందుకే ఈ పేరును మనం వాడకపోతే మంచిది” అని కైలాష్ విజయ్ అభిప్రాయపడ్డారు. “భారతదేశంలో సత్యజిత్ రే, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి వారు గొప్ప చిత్రాలు తీశారు. మన సంప్రదాయాలను అందులో చూపించారు. అలాంటప్పుడు మనం హాలీవుడ్‌ను కాపీ కొట్టడం ఏమిటి? అందుకే ఇలాంటి పదాలు బ్యాన్ చేయాలి. టాలీవుడ్, కోలీవుడ్ లాంటి పదాలు కూడా బ్యాన్ చేయాలి. మీడియా కూడా ఈ పదాలను ప్రచురించకుండా ఉంటే మంచిది” అని కైలాష్ విజయ్ తెలిపారు. అలాగే హాలీవుడ్‌కి కాపీ పేర్లలా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌ల వంటి పదాలను కూడా వాడకూడదని అన్నారు.