వివేక్ రామస్వామి.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఈ ఇండో అమెరికన్ పోటీ పడుతున్నారు. తన స్పీచ్‌లతో.. మాటలతో అక్కడి ఓటర్లనే కాదు ప్రముఖులనూ ప్రభావితం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు వివేక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో వివేక్‌కు సపోర్టుగా పోస్టులు చేస్తున్నారు.
వివేక్.. గత శుక్రవారం అయోవాలోని టౌన్హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వివేక్ అధ్యక్షుడిగా గెలిస్తే- టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తానని అన్నారు. మస్క్ ఎక్స్ పేరుతో గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసిన దాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారని.. ఆయన ట్విటర్‌ను నడుపుతున్న మాదిరిగా తాను ప్రభుత్వాన్ని నడిపిస్తానని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్ సైతం రామస్వామిని ‘నమ్మదగిన అభ్యర్థి’గా ప్రశంసించిన విషయం తెలిసిందే.