భారత మూలాలున్న అమెరికా పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున దూసుకెళ్తున్నారు. తన ప్రసంగాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న వివేక్ రామస్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
యాంటిఫా, బీఎల్ఎం దుండగులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. జనవరి 6 ఆందోళనకారులు మాత్రం ఇప్పటికీ బెయిళ్లు లభించక జైళ్లలోనే ఉన్నారని వివేక్ రామస్వామి అన్నారు. బైడెన్ ఆధీనంలోని ‘ఇన్‌జెస్టిస్’ విభాగం జనవరి 6న ఎటువంటి హింసకు పాల్పడకుండా ఆందోళన చేసిన 1000 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేసిందని.. తానే అధ్యక్షుడినైతే.. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు, రాజకీయ కక్షలతో కేసులు ఎదుర్కొంటూ చట్టపరమైన హక్కులకు దూరమైన అమెరికన్లందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తానని సంచలన కామెంట్స్ చేశారు. వీరిలో జనవరి 6వ తేదీన శాంతియుతంగా ఆందోళనలు చేసిన వారు కూడా ఉంటారని వివేక్ రామస్వామి వెల్లడించారు