పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై ప్రియుడు బ్లేడ్ తో దాడి చేశాడు . ఈ ఘటన విశాఖపట్టణం పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 59వ వార్డు నెహ్రునగర్ ప్రాంతంలో లలిత శ్రీ(19) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఇంటికి సమీపాన నిందితుడు రామారావు(26) ఉంటున్నాడు. ఇరురువు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రామారావు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడం లలితకి నచ్చలేదు
అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నా.. ఆమె ససేమిరా వద్దంది. సోమవారం రాత్రి భోజనం చేసి ఆమె మేడపై వాకింగ్ చేస్తున్న సమయంలో ఆమె వద్దకు మరో సారి వెళ్లి తన పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్ తో దాడి చేస్తానని భయపెట్టాడు. అయిన ఆమె అంగీకరించకపోవడంతో బ్లేడ్ తో గొంతు భాగంలో దాడి చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ,బంధువులు అక్కడికి చేరుకొని గాయపడిన లలిత శ్రీని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.