అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుశాంత్ – నివేద పేతురాజ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బన్నీ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. సినిమా వచ్చి ఏడు నెలలు దాటినా ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైం టీఆర్పీ రికార్డును నెలకొల్పింది.
ఈ ఆగస్టు 16న జెమినీ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం 29.4 టీఆర్పీ రేటింగ్ ని సాధించింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు ‘అల..’ని స్మాల్ స్క్రీన్ పై టాప్ లో నిలబెట్టారు. దీంతో ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4 టీఆర్పీని బ్రేక్ చేసినట్లయింది. సంక్రాంతి వార్ లో బాక్సాఫీస్ మొగుడు.. రంకు మొగుడు అంటూ పోటీపడిన ఈ రెండు సినిమాలు మరోసారి బుల్లితెరపై రేటింగ్స్ పోటీపడ్డాయి. అయితే టీఆర్పీ రేటింగ్స్ లో బన్నీ పైచేయి సాధించాడని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత ‘బాహుబలి – 2’ 22.7 టీఆర్పీతో మూడో స్థానంలో ఉండగా ‘శ్రీమంతుడు’ 22.54 టీఆర్పీతో నాలుగో స్థానంలో నిలిచింది.