షాకింగ్ న్యూస్: దుమ్ము తుఫాన్… ఉత్తరాదిని భయపెడుతోన్న ఎండలు………

వారం రోజులుగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఎండవేడిమికి జనం అల్లల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటికి కాలు తీసి వేయాలంటే.. భయపడే పరిస్థితి నెలకొంది. కూలర్, ఫ్యాన్ కొద్దిసేపు ఆగిపోయినా.. ఉక్కపోతను గురికాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే మే చివరి వారంలో ఎండలు మరింత తీవ్రరూపం దాలిస్తే ఎలా అని భయపడి పోతున్నారు జనం. దీంతో భారత వాతావరణ శాఖ ఉత్తరాది రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పగటిపూట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని తవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అదేవిధంగా ఆదివారం(మే 24) ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమ(మే 25), మంగళ(మే 26) వారాల్లో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని.. ఢిల్లీలో మంగళవారం పలుచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు చేరవచ్చునని ఐఎండీ తెలిపింది. అలాగే. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆకాశం మబ్బులు లేకుండా ఉంటుందని, ఉపరితలంపై గంటకు 20కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.  అంతేకాకుండా ఢిల్లీలోని సఫ్‌దర్‌గంజ్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నగరంలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఇక కనిష్ట ఉష్ణోగ్రత 28.7గా నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు రెట్లు ఎక్కువ. ఢిల్లీలోని పాలం,లోధి రోడ్,అయానగర్ ప్రాంతాల్లోని వాతావరణ కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.4డిగ్రీలు, 44.2డిగ్రీలు, 45.6డిగ్రీలుగా నమోదయ్యాయి. ఐఎండీ ప్రాంతీయ వాతావరణ విభాగం హెడ్ కులదీప్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి మే 28న కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉందన్నారు. అలాగే.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మే 29-30 తేదీల్లో గంటకు 60కి.మీ వేగంతో దుమ్ము తుఫాన్‌తో పాటు ఆకాశంలో ఉరుములు మెరుపులు సంభవించవచ్చునని సమాచారం.

కాగా ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీఘడ్, రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా రాబోయే రెండు రోజులు ఐఎండీ ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్‌కు ‘ఆరెంజ్’ వార్నింగ్ జారీ చేసింది. విశాలమైన ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇలా ఒక్కసారిగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.