సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు.
నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని తెలిపారు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు ఇంకా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరురోజులైన నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు.