హైదరాబాద్ లో హాట్ స్పాట్స్: రూల్స్ కఠినం అన్న అధికారులు

హైదరాబాద్ లో కరోనా రక్కసి రోజురోజుకు విజృంభిస్తోంది. మాయదారి వైరస్ క్రమేణా బలపడుతోంది. ప్రతి నిత్యం కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో కరోనా హాట్ స్పాట్స్ ను గుర్తించారు అధికారులు. కరోనా బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఈ నెల పద్నాలుగవ తేదీతో పూర్తవుతుంది. ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా? లేదా? అన్న అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేస్తే… హైదరాబాద్ లో మాత్రం ఎంపిక చేసిన హాట్ స్పాట్ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాల్లో ఎప్పటిలాగే గట్టి పర్యవేక్షణ ఉండ నుంది. నగరంలో మొత్తం 12 కరోనా హాట్ స్పాట్స్ ను గుర్తించారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, మయూరినగర్, చెందానగర్, ఆల్వాల్, కూకట్ పల్లి, మూసాపేట, షేక్ పేట, రాంగోపాల్ పేట, రెడ్ హిల్స్, యూసఫ్ గూడ, మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్టలను కరోనా హాట్ స్పాట్స్ గా అధికారులు గుర్తించి అక్కడ ఇప్పటికే అదనపు బలగాలను మోహరించారు. భారీగా బారికేడ్ లను ఏర్పాటు చేసి కఠిన ఆంక్షలను విధించింది ప్రభుత్వం.