నూతన సంవత్సర వేడుకల వేళ గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని డొమెస్టిక్ కేటగిరీ వినియోగదారులందరికీ గత 13 నెలలకు సంబంధించిన నీటి బిల్లులను మాఫీ చేసింది. ఈ మేరకు వాటర్‌బోర్డుకు పురపాలక శాఖ గురువారం ఆదేశాలతో పాటు మెమోను జారీచేసింది. గ్రేటర్ వ్యాప్తంగా గృహ నల్లాలకు ఉచిత తాగునీరు వర్తింపజేసే పథకానికి 2020 డిసెంబరులో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 9,84,023 లబ్ధిదారులు ఉండగా గురువారం నాటికి 5లక్షల మంది నల్లాదారులు అనుసంధానం చేశారు.
తాజాగా బిల్లుల మాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఇది కేవలం 13 నెలల బిల్లులకు మాత్రమే వర్తిస్తుందని, అది కూడా 20వేల లీటర్లకు మాత్రమేని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ వాడుకున్న వారు బిల్లులను చెల్లించాల్సిందే. ఈ నిర్ణయంతో వాటర్ బోర్టుపై రూ.400 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే చెల్లించిన వాటర్ సెస్‌ను ఆయా వినియోగదారులకు భవిష్యత్తులో సర్దుబాటు చేస్తారు. డిసెంబర్ 2020 కంటే ముందు ఉన్న బకాయిలకు వడ్డీతో సహా బిల్లులు ఇవ్వనున్నారు. ఉచిత నీటి పథకం లబ్ధిదారులు 20 వేల లీటర్ల లోపు వాడితే జీరో బిల్లు ఇస్తారు.