ప్రధాని మోదీకి 2014 నుంచి ఇప్పటి వరకు 14 దేశాలు అత్యున్నత జాతీయ పురస్కారాలను అందజేశాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. 2018లో అత్యున్నత పర్యావరణ అవార్డును మోదీకి ఐక్య రాజ్యసమితి ప్రదానం చేసిందని గుర్తు చేశారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి గురువారం రాజ్యసభకు వీటి వివరాలను తెలిపారు. ప్రపంచ స్థాయి, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాల్లో మోదీ చూపిన రాజనీతిజ్ఞత, నాయకత్వ పటిమకు గుర్తింపుగా ఆయా పురస్కారాలు లభించాయన్నారు.
‘ఇజ్రాయెల్కు కార్మికులను పంపించడంపై చర్చించలేదు’
ఇజ్రాయెల్లో పనిచేస్తున్న పాలస్తీనా కార్మికుల స్థానంలో భారతీయ కార్మికులను నియమించే విషయాన్ని ఆ దేశంతో చర్చించలేదని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కె.సి.వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానమిచ్చారు. హమాస్తో ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని నిర్మాణ రంగం దాదాపు లక్ష మంది కార్మికులను నియమించుకోవాలని భావిస్తోందని, దీనికిగాను భారతీయ కార్మికుల వైపు ఆ దేశం చూస్తోందని వార్తలు వచ్చాయి.
విమానాల రేడియో అల్టీమీటర్లకు ‘5జీ’ అంతరాయం!
విమానాల్లో అమర్చే రేడియో అల్టీమీటర్లకు 5జీ నెట్వర్కుతో అంతరాయాలు ఏర్పడే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు వెల్లడించింది. అయితే, ఈ ప్రభావం అంచనా వేసేందుకు దేశీయంగా తాము ఎలాంటి అధ్యయనం చేయలేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అధ్యయనాలు, తీసుకొన్న చర్యలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అధ్యయనం చేసినట్లు ఈ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు.
భారత్ నుంచి అమెరికాకు 2 లక్షల అక్రమ వలసదారులు
అమెరికా అధికారులు గత అయిదేళ్లలో భారత్ నుంచి 2,00,760 మంది అక్రమ వలసదారులను ఎదుర్కొన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పార్లమెంటుకు తెలిపారు. అమెరికా ఆర్థిక సంవత్సరం 2022-23లో (అక్టోబరు నుంచి సెప్టెంబరు దాక) అత్యధికంగా 96,917 కేసులు ఇలాంటివి నమోదైనట్లు వెల్లడించారు. యూఎస్ సరిహద్దు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన భారతీయుల వివరాలు అందుబాటులో లేవన్నారు.