జనవరి మూడో వారం నాటికి మహారాష్ట్రలో రెండు లక్షల కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు కావచ్చని అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. ప్రదీప్ వ్యాస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ మూడో వేవ్ ప్రమాదకారి కాదని ప్రజలు నిర్లక్ష్యం వహించడం తగదని, వ్యాక్సిన్ వేయించుకోనివారికి ప్రాణాంతకం కావొచ్చని, వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాడు 9,170 కరోనావైరస్ కొత్త కేసులు నమోదవ్వగా, ఏడుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
గత 11 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియల హాజరుపై గురువారం కొత్త ఆంక్షలు ప్రకటించింది.తాజా ఆంక్షల ప్రకారం వివాహాలు లేదా ఏదైనా ఇతర సామాజిక, రాజకీయ లేదా మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 50 మందికి మించకూడదు. అలాగే అంత్యక్రియలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 20కి పరిమితం చేయబడింది. సోమవారంనాటికి దేశంలోనే అధిక సంఖ్యలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.