చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి చెందిన అంగల్లు వద్ద 20 ఏళ్ల యువతి మీద సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆగష్టు3నే జరిగింది, అయితే ఆమె నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
తిరుపతి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ కధనం ప్రకారం మూడవ సంవత్సరం బిటెక్ విద్యార్థిని అయిన బాధితురాలు ఆమె ప్రియుడు ఆగస్టు 3న అంగల్లులోని హంద్రీ-నీవా కాలువ వద్ద ఏకాంతంగా కూర్చుని ఉన్నారు, అయితే సాయంత్రం 7 గంటల సమయంలో అక్కడ దగ్గరలో ముగ్గురు యువకులు, సమీపంలో మద్యం సేవించడానికి వచ్చారు.
ఈ జంట ఏకాంతంగా ఉండడం చూసిన వీరు ఆ జంట మీద దాడి చేశారు. అయితే ఈ సమయంలో భయపడ్డ ఆమె ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. దీంతో ఆ ముగ్గురూ ఆమెను మెయిన్ రోడ్ నుంచి లోపలకి లాగి లైంగికదాడికి పాల్పడ్డారు.
ఆమె స్టేట్మెంట్ ఆధారంగా స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులు తన గ్రామానికి చెందినవారని, ఈ సంఘటనపై ఫిర్యాదు చేస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయని వారు తనను బెదిరించారని బాధితురాలు పేర్కొంది.