గోదావ‌రి లాంచి ప్ర‌మాదంలో 22 మంది జ‌ల‌స‌మాధి

22 People died with Boat drowning in Godavari

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోదావ‌రిలో లాంచీ ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న చేశారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో 22 మంది మృతిచెందిన‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు బాలురు స‌హా 12 మంది మృత‌దేహాలు వెలికితీశార‌ని, మ‌రో 10 మృతదేహాల‌ను వెలికితీయాల్సి ఉంద‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 10ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం అందిస్తామ‌ని, త‌క్ష‌ణ సాయం కింద ల‌క్ష‌రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పారు. బాధిత కుటుంబాల‌ను అన్నివిధాలా ఆదుకుంటామ‌ని, బాధిత కుటుంబ స‌భ్యుల‌ను చూస్తే బాధేస్తోంద‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం లాంచీ చెకింగ్ జ‌రిగింద‌ని, అయితే సాయంత్రం బోటు న‌డిపిన వారు సిమెంటు బ‌స్తాలు తీసుకురావ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌న్నారు. లాంచీలో ఎన్ని సిమెంటు బ‌స్తాలు చేర్చారో విచార‌ణ చేస్తున్నామ‌ని, బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు.

అటు మృత‌దేహాల వెలికితీత‌తో ఘ‌ట‌నాస్థ‌లం వ‌ద్ద ప‌రిస్థితి హృద‌య‌విదార‌కంగా మారింది. లాంచీలో ఉన్న త‌మ‌వారి ఆచూకీ కోసం నిన్న‌టి నుంచి ఎదురుచూసిన కుటుంబ స‌భ్యులు మృత‌దేహాలు చూసి గుండెల‌విసేలా ఏడుస్తున్నారు. వెలికి తీసిన మృత‌దేహాల‌కు అక్క‌డే పోస్టుమార్టం చేసేలా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేయ‌డంతో…వెంట‌నే స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లిస్తున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే పోలీస్ యంత్రాంగం, ప్ర‌భుత్వ సిబ్బంది రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే లాంచీ న‌దిలో 45 అడుగుల లోతుకు వెళ్లిపోవ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ఉద‌యం ఎన్డీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది న‌దిలో గాలించి లాంచీని గుర్తించారు.

అద్దాలు ప‌గుల‌గొట్టి లోప‌లికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించినా…సాధ్యం కాలేదు. లాంచీ త‌లుపులు తెరుచుకోక‌పోవ‌డంతో తాళ్లు క‌ట్టి ఇత‌ర బోట్లు, క్రేన్ల సాయంతో లాంచీని బ‌య‌ట‌కు లాగారు. ముఖ్య‌మంత్రి మ‌ధ్యాహ్నం నుంచీ ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఉన్నారు. మృత‌దేహాల వెలికితీత‌ను, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్టీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది మొత్తం 126 మంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని సీఎం తెలిపారు. నిన్న రాత్రి చీక‌టి వ‌ల్ల ఏమీ చేయ‌లేక‌పోయామని, ఈ ఉద‌యం నుంచి ఆప‌రేష‌న్ ఉధృతంచేసి అన్ని విధాలా ప్ర‌య‌త్నించి..ఇప్ప‌టివ‌ర‌కు 12మంది మృత‌దేహాలు వెలికితీశామ‌ని చెప్పారు. మాన‌వ‌త‌ప్పిదం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని, బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.