Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన రంగాల్లో అభివృద్ధి జరిగిందో,లేదో గానీ మీడియా విషయంలో మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. అప్పటికే అన్ని న్యూస్ ఛానెల్స్ తమ కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్ లో పెట్టేశాయి. విభజన జరిగిన కొత్తల్లో ప్రధాన ఛానెల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ లో రెండో ఛానల్ పెడతామని హడావిడి చేశాయి. అయితే ఎలక్ట్రానిక్ మీడియా రంగ పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో ఒక్క ఈ టీవీ తప్ప ప్రత్యేకంగా ఏపీ కోసం న్యూస్ ఛానల్ ఎవరూ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఆయా ఛానెల్స్ ఏపీ లో విజయవాడ కేంద్రంగా కొత్తగా స్టూడియోలు, స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయిన మహా టీవీ మాత్రం కొత్త యాజమాన్యం కింద త్వరలో విజయవాడ కేంద్రంగా పని చేసే ఆలోచనలో వుంది .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీ లో విజయవాడ కేంద్రంగా నేడు ఓ సరికొత్త న్యూస్ ఛానల్ తన టెస్ట్ సిగ్నల్ ప్రారంభం జరిపింది. ఆ ఛానల్ పేరు ఏపీ 24 / 7 . విభజన తర్వాత విజయవాడ కేంద్రంగా ఈ స్థాయిలో శాటిలైట్ ఛానల్ మొదలు కావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. అయితే రానున్న ఎన్నికల దృష్టితో మరికొన్ని న్యూస్ ఛానెల్స్ సైతం త్వరలో ఇక్కడ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం.