కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఆరంగ్రేట్ర టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. అంతే కాకుండా పలు రికార్డులను కూడా సృష్టించాడు. ఆరంగ్రేట్ర టెస్ట్‌లో సెంచరీ, అర్ధసెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. అంతేకాకుండా డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. కాగా తొలి టెస్ట్‌కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి రెండో టెస్ట్ కోసం జట్టులో చేరనున్నాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.
తొలి టెస్ట్‌లో కోహ్లి స్ధానంలోనే శ్రేయస్‌కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో ముంబై వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో శ్రేయస్‌ను పక్కన పెడతారా.. లేక వరుసగా విఫలమవుతున్న పూజారాకు విశ్రాంతి ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఈ టెస్ట్‌లో పూజారా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానేపై వేటు పడనుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తొలి టెస్టులో రహానే బ్యాటర్‌గా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకే అవుటైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క బౌండరీ బాది పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.