ఈతకి వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత

ఈతకి వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత

కృష్ణ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన నందిగామలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన మరో ఘటనలో మూడేండ్ల బాలుడు నీటి గుంతలో పడి మరణించాడు. మొదటి ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలంలోని దాములూరు గ్రామంలో కట్లేరు నదిలో స్నానం చేసేందుకు ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగగా, నీటి ప్రవాహాం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు.

గమనించిన స్థానికులు ఐదుగురు విద్యార్థులను రక్షించారు. కానీ మిగిలిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతిచెందిన వారిలో వీరులపాడు మండలంలోని నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.గోపిరెడ్డి(20), బీఎస్సీ చివరి సంవత్సరం అభ్యసిస్తున్న ఎస్.శ్రీనివాసరెడ్డి(20), డి.రవీంద్రరెడ్డి(18)(బీఎస్సీ ప్రథమ సంవత్సరం)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.