నెమలిలా నాట్యం చేస్తున్న వృద్ధురాలు

నెమలిలా నాట్యం చేస్తున్న వృద్ధురాలు

లేడిపిల్లలా చెంగుచెంగున నడుస్తూ.. నెమలిలా నాట్యం చేస్తోంది కృష్ణకుమారి తివారి. నాట్యం చేస్తుంటే అందరి కళ్లు ఆమె పైనే. కాళ్లకు ఘల్లుఘల్లుమనే గజ్జలు కట్టుకుని, నాట్యంతో హావభావాలు పలికిస్తోన్న అమ్మాయి కదా అందరూ ఆసక్తిగా చూస్తారులే అనుకుంటే మీరు పొరబడినట్లే. డెబ్భైఎనిమిదేళ్ల వయసులో మైమరిపించే స్టెప్పులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది కృష్ణకుమారి బామ్మ.

నేపాల్‌లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణకుమారి తివారికి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఇంట్లో వాళ్లు డ్యాన్స్‌ను ప్రోత్సహించేవారు కాదు. సంప్రదాయ కుటుంబాలలోని ఆడపిల్లలు డాన్సులంటూ తిరిగితే సమాజం నుంచి వెలేస్తారేమోనని భయపడే రోజుల్లో ఆమె బాల్యం గడిచింది. దీంతో తనకి ఎంతో ఇష్టమైన నాట్యం తీరని కలగానే మిగిలిపోయింది. పెళ్లీ, పిల్లలు, వారి బాధ్యతలు అన్నీ తీరడం, ఇప్పుడు తీరిక దొరకడం చిన్నప్పటి కట్టుబాట్లు ప్రస్తుతం లేకపోవడంతో ఒంట్లోని ఓపికను కూడగట్టుకుని పదహారేళ్ల పడచు పిల్లలా డ్యాన్స్‌ చేస్తూ తన చిరకాల కోరికను తీర్చుకుంటోంది.

కృష్ణకుమారి డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోలు ఆమె కుటుంబ సభ్యులు టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఇప్పుడవి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆమె డ్యాన్సింగ్‌ వీడియోలలో ఒకదానికి దాదాపు రెండుకోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయి.కృష్ణకుమారి డ్యాన్స్‌ గురించి తెలిసిన వారంతా ఆ చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లు, పార్టీలకు ఆహ్వానిస్తూ ఆమె డ్యాన్స్‌ను మరింత ప్రోత్సహిస్తున్నారు.

‘‘అప్పటి సమాజంలో ఉన్న నిబంధనలను అనుసరించి డ్యాన్స్‌ చేయాలన్న ఆకాంక్షను నాలోనే అణచి వేసుకున్నాను. అయితే ఇప్పుడు నాకేం జరుగుతుందే తెలియడం లేదు. ఎప్పుడూ డ్యాన్స్‌ చేస్తూనే ఉంటున్నాను. ఎవరూ నన్ను ఆపడంలేదు, నా పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. నా డ్యాన్స్‌ వీడియోలకు చాలా మంది అభిమానం చూపిస్తుంటే మరింత డ్యాన్స్‌ చేయాలనిపిస్తోంది. డ్యాన్స్‌ చేస్తూ చనిపోవాలని ఉంది’’ అని చెప్పారు కృష్ణకుమారి సంతోషంతో నీళ్లు నిండిన కన్నులతో.