శశికళకు పెద్ద షాక్ ఇచ్చిన ఆదాయపు పన్నుశాఖ

శశికళకు పెద్ద షాక్ ఇచ్చిన ఆదాయపు పన్నుశాఖ

తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న వీకే శశికళకు ఆదాయపు పన్నుశాఖ బుధవారం చాలా పెద్ద షాక్ ఇచ్చింది. శశికళ+కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసేసింది. బినామీ చట్టం కింద తాము శశికళతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించటం నిజంగా కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఐటిశాఖ ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో చెన్నైలోని పొయెస్ గార్డెన్ లోని ఆస్తి కూడా ఉండటం గమనార్హం.

చెన్నైలోని పొయెస్ గార్డెన్ అంటేనే ముందుగా అందరికీ దివంగత ముఖ్యమంత్రి జయలిలతే గుర్తుకొస్తారు. ఆమె ఇల్లు వేదనిలయంకు ఎదురుగా ఉన్న పెద్ద స్ధలంలో విశాలమైన భవనాన్ని నిర్మించుకోవాలని శశికళ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ స్ధలం విలువే సుమారు రూ. 300 కోట్లుంటుందని ఐటిశాఖ లెక్క కట్టింది. రూ. 300 కోట్లు పెట్టి స్ధలం కొనుగోలు చేశారంటే అది ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి స్ధలంలో వేదనిలయానికి ధీటైన సువిశాలమైన భవనాన్ని కట్టుకోవాలని శశికళ అనుకున్నారు. ఆయితే ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా అరెస్టవ్వటంతో భవనం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇపుడు ఐటిశాఖ ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో అది కూడా ఉంది.

షెల్ కంపెనీల ఏర్పాటుతో శశికళ కొనుగోలు చేసిన ఆస్తులన్నింటినీ ఐటిశాఖ గుర్తించింది. అందుకనే ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేసేసింది. జయలలిత జీవించున్నంత కాలం చాలా బిజీగా ఉన్న శశికళ శ్రీ హరిచందన ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు. విచిత్రమేమిటంటే ఈ రియల్ ఎస్టేట్ ఆఫీసు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో కూడా ఉండటం. 2003-05 మధ్యకాలంలో 200 ఎకరాలతో కలిపి 65 ఆస్తులను కూడబెట్టినట్లు ఐటిశాఖ గుర్తించింది. ఈ ఆస్తులన్నీ బినామీల పేర్లతోనే ఉండటం గమనార్హం.

పెద్దనోట్ల రద్దు సమయంలో అప్పటికప్పుడు రూ. 1674 కోట్ల విలువైన ఆస్తులను శశికళ కుటుంబం కొనుగోలు చేసింది. ఎక్కడెక్కడ ఆస్తులను కొనుగోలు చేసింది, ఎవరిపేరుతో ఆస్తులను కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా శశికళే తన బంధులకు లేఖల రూపంలో తెలియజేశారు. లేఖలు అందుకునే వరకు తమ పేర్లతో ఆస్తులున్న విషయం కూడా వాళ్ళెవరికీ తెలియదు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే ఓ పౌష్టికాహార కాంట్రాక్టర్ కు శశికళ రూ. 237 కోట్లను అప్పుగా ఇచ్చారట. ఈ లావాదేవీలన్నింటిని ఐటిశాఖ ఉన్నతాధికారులు గుర్తించి అందుకు అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్ధం చేశారు.