మహిళపై ఉమ్మూసిన బైకర్.. భయం గుప్పెట్లో ఆ నగరం

కరోనా వైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తుంది. ఆయా దేశాలను గజగజలాడిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో చాలా వేగంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న ఈ సమయంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముంబైలో తాజాగా అత్యవసరమైన వస్తువులను కొనడానికి బయలుదేరిన ఓ మణిపురి మహిళపై బైక్ పై వెళ్తున్న ఈ వ్యక్తి ఉమ్మివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శాంటాక్రూజ్ ఈస్ట్ సమీపంలోని కలినా మిలిటరీ క్యాంప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వోకాలా పోలీసులు ఇప్పుడు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

బైక్ నడుపుతోన్న ఓ వ్యక్తి తన ముసుగు తీసేసి ఆ మణిపురి మహిళపై ఉమ్మివేసి అక్కడి నుంచి పారిపోయాడని 25 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తనకు షాక్ కు గురి చేయడంతో ఆ ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నోట్ చేసుకోలేకపోయానని బాధితురాలు తెలిపింది. కాగా ఈ ఘటన జరిగినప్పుడు ఆ మహిళ తన స్నేహితుడితో ఉందని తెలిపింది. కాగా ఆగంతకుడు ఆ చర్య కారణంగా తనకు కోవిడ్ -19 సంక్రమించే అవకాశాల ఉన్నాయని ఆ మహిళ తీవ్ర భయబ్రాంతులకు లోనవుతోంది.

ఈ ఘటన గురించి బాధితురాలి స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చాలా ఘాటుగా పోస్ట్ చేశాడు. ఇలాంటి ఘటనల కారణంగా నగరం పరువు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ ఘటనపై ‘నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యు) కూడా స్పందించింది.జాతి వివక్షత వల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడా లేక మరేమైన కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కూడా కోరింది.