అల్లుడిని చంపిన అత్త

అల్లుడిని చంపిన అత్త

హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడికి తన కూతురినే ఇచ్చి పెళ్లి చేసిన అత్త చివరికి అతన్ని దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కత్తితో పొడిచి కిరాతకంగా అల్లుడిని అంతమొందించింది. ఉప్పల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ఏరియా కేసీఆర్ నగర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వనితకి అదే ప్రాంతానికి చెందిన నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడిని విడిచి ఉండలేకపోయిన వనిత నీచానికి పాల్పడింది. తన కూతురిని ప్రియుడికిచ్చి వివాహం జరిపించింది. అయితే పెళ్లైన కొద్దిరోజుల నుంచే కూతురుకి భర్త వేధింపులు మొదలయ్యాయి. అంతేకాకుండా భర్తకి తన తల్లితో వివాహేతర సంబంధం ఉందని కూతురికి తెలిసిపోయింది. భర్త వేధింపులు, తల్లితో రాసలీలలు వ్యవహారంతో మానసికంగా కుంగిపోయిన కూతురు నాలుగు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది.

కూతురు చనిపోయిన తర్వాత కూడా అత్తాఅల్లుడు అక్రమ సంబంధాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా నిన్న రాత్రి అత్త వనిత అల్లుడిని దారుణంగా హత్య చేసింది. కత్తితో పొడిచి కిరాతకంగా చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూతురి మరణానంతరం కూడా కలిసి ఉన్న అత్త అల్లుడిని ఎందుకు హత్య చేసిందనే విషయం మిస్టరీగా మారింది.