ఆటలో భావోద్వేగాలకు చోటు లేదు

ఆటలో భావోద్వేగాలకు చోటు లేదు

పేలవ ప్రదర్శనతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనా… వచ్చే ఏడాది కూడా ఎంఎస్‌ ధోనినే జట్టు కెప్టెన్‌గా కొనసాగవచ్చని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయ పడ్డాడు. ధోనికి, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం అలాంటిదని అతను వ్యాఖ్యానించాడు. రెండు వైపులనుంచి పరస్పర గౌరవం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గంభీర్‌ అన్నాడు.

‘ఐపీఎల్‌ ప్రారంభమైన నాటినుంచి చెన్నై మేనేజ్‌మెంట్‌ ధోనికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దానికి తగినట్లుగానే అతను అద్భుత ఫలితాలు సాధించి చూపించాడు. జట్టు కోసం ఎంతో చేశాడు. కాబట్టి మరోసారి ధోనిని చెన్నై కెప్టెన్‌గా కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు. అతనికి మేనేజ్‌మెంట్‌పై, వారికి ధోనిపై ఉన్న పరస్పర గౌరవం, అనుబంధమే అందుకు కారణం. ఆటలో భావోద్వేగాలకు చోటు లేదు అనే మాటలు చెప్పడం సులువే కానీ ఆ దగ్గరితనాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి 2021లో ప్రస్తుత జట్టులో చాలా మార్పులు జరిగినా కెప్టెన్‌గా మాత్రం ధోనినే ఉంటాడని నేను నమ్ముతున్నా’ అని గంభీర్‌ విశ్లేషించాడు.