ఆ యువతికి 18 వసంతాలు నిండి 19లోకి అడుగిడుతోన్న వేళ ఆ ఇంట ఆనందం..కొత్త దుస్తులు సైతం తెచ్చారు.. అందరి మధ్య కోలాహలంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని టైం కూడా ఫిక్స్ చేశారు. కానీ, ఆ యువతి ఆలోచన మరోలా ఉంది. తన మరణాన్ని తానే ఫి క్స్ చేసుకుని కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగిల్చింది. మంగళవారం ఈ సంఘటన మండలంలోని ఏటుకూరిపల్లెలో చోటుచేసుకుంది. ఆ బలవన్మరణం విషాదంలోకి వెళితే..గ్రామానికి చెందిన శశికళకు నరేష్, నందిని (18) సంతానం. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త చనిపోవడంతో అప్పట్లో ఆమె తమిళనాడు నుంచి పిల్లలతో సహా తన తల్లిదండ్రులు గోపాల్ మందడి, పంకజ చెంతకు చేరింది.
శశికళ కూలి పనులకు వెళ్తూ పిల్లలను చదివిస్తోంది. నరేష్ (20)ను ఐటీఐ చదివించింది. కుమార్తె నందిని డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇదే విషయమై నందినికి చెప్పడంతో ఆమె విభేదించింది. తనకు ఇప్పట్లో పెళ్లి ఇష్టం లేదని, బాగా చదివి స్థిరపడ్డాకే చేసుకుంటానని తేల్చిచెప్పింది. అయితే పెద్దలు మాత్రం దీనికి అంగీకరించలేదు. పెళ్లిచేసుకుంటే తమ బాధ్యత తీరినట్లవుతుందని చెప్పారు. దీనిని నందిని తీవ్రంగా వ్యతిరేకించింది. రెండ్రోజులుగా ఇది కుటుంబంలో గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో నందిని మంగళవారం ఉదయం త్వరగా ఇంటి పనులు చేసింది. ఇదేరోజు పుట్టినరోజు కావడంతో 10గంటలకు బర్త్డే వేడుకలు చేయాలని కుటుంబ సభ్యులు ఆ సన్నాహాల్లో పడ్డారు.
అయితే 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన నందిని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకేసింది. ఆ శబ్దం విన్న గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. బావిపక్కన నందిని పాదరక్షలను గుర్తించారు. గ్రామ యువకులు పాతాళభైరవితో గాలించినా ఫలితం శూన్యం. సమాచారం ఇవ్వడంతో చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకుని శ్రమించారు. మోటార్లతో నీళ్లు తోడారు. నాలుగు గంటలపాటు కష్టపడి చివరకు నందిని మృతదేహాన్ని వెలికితీశారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే శశికళ గుండెలవిసేలా రోదించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి ఎస్ఐ షేక్షావలి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.