టీనేజ‌్ ప్రేమ వ్యవహారాలు ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. అందమో.. ఆకర్షణో.. అమాయకత్వమో కానీ చూసిన వెంటనే ప్రేమలో పడిపోతున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటేస్తున్నారు. పెద్దలు వద్దని వారించినా వినకుండా వివాహాలు చేసుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా.. వివాహం అయిన తర్వాత కొద్దిరోజులకే విడిపోయిన జంటలు ఎన్నో. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని.. ప్రభుత్వ ఉద్యగం చేస్తున్నానంటూ పెళ్లి చేసుకున్న ప్రియుడి మోసాలు బయటపడిన ఘటనలు కూడా చాలానే చూశాం.
అయితే ప్రేమిస్తున్నానని చెప్పి ఓ ప్రబుద్ధుడు.. ఇంటి పేరు మార్చుకుని చెల్లెలిని పెళ్లి చేసుకున్న షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీరా కట్టుకున్న భర్త తనకు అన్నయ్య అని తెలిసిన యువతి సిగ్గుతో చచ్చిపోయిన విషాద ఘటన వెలుగుచూసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని నెహ్రూనగర్ తండాకు చెందిన గీత డిగ్రీ చదువుతోంది.
ఆమెకి కట్టుగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పరిచయమై ప్రేమకు దారితీసింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పి వివాహం జరిపించాలని కోరారు. అందుకు పెద్దలు నిరాకరించడంతో వారిని ఎదిరించి పది రోజుల కిందట వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత భర్త పూర్తి వివరాలు తెలుసుకుని భార్య మనస్థాపానికి గురైంది.
అన్నయ్య వరసయ్యే వెంకటేష్ అబద్ధం చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె కుంగిపోయింది. సోదరుడితో వివాహమేంటని సిగ్గుతో చచ్చిపోయింది. పురుగుల మందు తాగేసి ప్రాణాలు తీసుకుంది. గీత ఆత్మహత్య చేసుకుందని తెలిసిన వెంకటేష్ బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పెళ్లైన పది రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
తన ఇంటి పేరు మార్చి మోసం చేసి గీతను పెళ్లి చేసుకున్నాడని.. అన్నతో పెళ్లైందని తెలిసి తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంకటేష్ ఇంటిపై దాడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.