వారం రోజుల్లో జరగాల్సిన పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోహిద్దీన్పురం గ్రామానికి చెందిన వేల్పుల ఏడుకొండలు(22) కుటుంబం కొంత కాలం క్రితం ఉపాధి నిమిత్తం బేతంచెర్లకు వచ్చి స్థిరపడ్డారు. అయ్యలచెర్వులోని పాలీస్ బండల ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు.
మహానంది మండలం నందిపల్లెకు చెందిన యువతితో ఆగస్టు 7న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కాగా కొన్ని కారణాల వల్ల యువతి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం శానిటైజర్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి తరలించగా, కోలుకోలేక మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.సురేష్ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు.