నూతన సంవత్సరం అంటే నూతన లక్ష్యాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడమే

క్యాలెండర్‌ ‌లో సంవత్సరం మారినంత మాత్రాన మన తల రాతలు మారపోతాయని, అదృష్టం వరిస్తుందని అందరి ఆశ. కొత్త సంవత్సరమంటే ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఉత్సాహం నెలకుంటుంది. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అర్థరాత్రి వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. డిసెంబర్‌ 31 ‌రాత్రి అట్టహాసంగా వేడుకలు, సంబరాలు చేసుకున్నంత మాత్రాన రాబోయే సంవత్సరం అంత సంతోషంగా ఉంటామనే సెంటిమెంట్‌ ‌తప్పు. ప్రస్తుత సంవత్సరంతో ముడిపడి ఉండేదే నూతన సంవత్సరం. నూతన సంవత్సరం అనేది ఒక పండుగ కాదు కేలండర్‌ ‌లో వచ్చే మార్పు మాత్రమే. మరియు ఈ కొత్త సంవత్సరం ముస్లిం సోదరులది కాదు హిందూ సోదరులది కాదు.

ముస్లింలకు మొహర్రమ్‌ అయితే, ‌హిందువులకు ఉగాది నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. బ్యాంకింగ్‌ ‌మరియు ఆర్థిక కార్యకలాపాలకు ఏప్రిల్‌ 1న నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. విద్యార్థులకు జూన్‌ ‌ను నూతన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే మనదేశం లో ఆంగ్ల కేలండర్‌ ‌నే ప్రామాణికంగా తీసుంటారు కాబట్టి జనవరి ఒకటో తారీఖున కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే ఈ రోజు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యమిస్తారో అంతే ఎక్కువగా మనం గత సంవత్సరంలో సాధించిన విజయాలను మరియు చవిచూసిన అపజయాలను విశ్లేషించాలి మరియు ఈ సంవత్సరంలో ఛేదించాల్సిన లక్ష్యాలను గుర్తించి సంబంధిత ప్రణాళికలను రూపొందించుకోవాలి. మరియు గత సంవత్సరంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే కొత్త సంవత్సరాన్ని సంపూర్ణంగా ఆహ్వానించినట్లు అవుతుంది. అనుకున్నట్లు ప్రణాళికలను అమలు చేసి విజయం సాధించినప్పుడే ఒక సంవత్సరానికి మంచి ముగింపును ఇవ్వగల్గుతాము. నూతన సంవత్సరం సాకుతో డబ్బు వృథా చేసుకొకూడదని మనవి.

కొత్త సంవత్సరం సంబరాలు ఎవరు మొదటగా జరుపుకుంటారు

కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, తీర్మానాలు. ఆ మధుర క్షణాలకోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే అసలు ఈ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే సాంప్రదాయం ఎప్పుడు మొదలైందనే విషయంపై భిన్నవాదనలున్నాయి. జూలియన్‌ ‌క్యాలెండర్‌ ‌విషయంపై భిన్నవాదనలున్నాయి. గ్రెగోరియన్‌ ‌క్యాలెండర్‌ ‌లేదా జూలియన్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారం జనవరి ఒకటో తారీకుని ప్రపంచవ్యాప్తంగా నూతనసంవత్సర ఆరంభదినంగా తీర్మానించారు. దాదాపుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచే నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్నారని ఒక అంచనా. ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలను బట్టి కొన్ని దేశాలు ఇతర తేదీలను కూడా సంవత్సరాదిగా పాటిస్తున్నాయి. రష్యా వంటి కొన్ని దేశాలు ఒక్క ఏడాదిలోనే రెండుసార్లు నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటాయి.

భూభ్రమణాన్ని బట్టి వివిధ టైమ్ జోన్ల కారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే, వివిధ టైమ్ జోన్ల కారణంగా మనకంటే ముందే కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. అలాగే మరికొన్ని దేశాల్లో మన తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేదెవరో, చిట్టచివరగా ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికేదెవరో పరిశీలిస్తే, ప్రపంచంలో అందరికంటే మొదటగా న్యూజిలాండ్లో న్యూ ఇయర్‌ ‌ప్రవేశిస్తుంది. న్యూజిలాండ్‌ ‌ఛాథమ్‌ ‌దీవుల్లో మొట్టమొదట కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటారు. ఇక్కడ వేడుకలు మొదలైన ఇరవై నాలుగు గంటల తర్వాత భూగోళం మీద అందరికంటే చివరిగా, అమెరికాలోని సమోవా దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి.