బోరుబావి సర్వీస్ వైరు కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన గూడెపు లక్ష్మణ్(40) విద్యుత్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు స్థానిక రైతులకు ఏదైనా సమస్యలు తలెత్తితే లక్ష్మణ్‌తో చేయిస్తుంటారు.
అదే గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ అలీ బోరు మోటారు సర్వీస్ వైర్ కనెక్షన్ ఇచ్చేందుకు లక్ష్మణ్‌ని తీసుకెళ్లాడు. కాగా, పెద్దగొట్టిముక్ల కు చెందిన రైతు అనిల్ ఆదివారం తన వరి పంటను కోసేందుకు కోత యంత్రం రావడంతో విద్యుత్ వైర్లు కిందికి ఉన్నాయని ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేసి, ఆన్ఆఫ్ హ్యాండిల్‌కు టవల్ చుట్టి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలానికి వచ్చిన అనిల్.. ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేయగా.. అప్పటికే లక్ష్మణ్ విద్యుత్ స్తంభంపై ఉండటంతో ప్రాణాలు కోల్పోయాడు.