పరీక్ష నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థి విగత జీవిగా మారింది. కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో శనివారం హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది. వివరాలు.. హుంజ్హును జిల్లాకు చెందిన యువతికి ఇటీవల ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ పరీక్ష ఉన్నందున ఇంటి నుంచి బయలుదేరి రాజపార్క్ ప్రాంతంలోని తన కళాశాలకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి 10 వరకు పరీక్ష రాసి బయటకు రాగా అదే సమయంలో ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేసి 10.30 గంటలకు ఆమెపై కాల్పులు జరిపాడు.
ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చూపట్టారు. నిందితుడు ధోల్పూర్కు చెందిన విష్ణుగా గుర్తించిన పోలీసులు అతను జైపూర్లో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య వెనుక గల కారణం స్పష్టంగా తెలియదని, దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు.