డబ్బు కోసం కన్నతండ్రిని హత్య చేసిన కేసులో నిందితున్ని అరెస్ట్ చేసినట్లు పీలేరు సీఐ సాధిక్ అలి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పీలేరు మండలం దొడ్డిపల్లె పంచాయతీ కొండ్రెడ్డిగారిపల్లెకు చెందిన గుండ్లూరు తిమ్మయ్య (75) ఈ నెల 11వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విచారణలో డబ్బు కోసం కొడుకే హత్య చేసినట్టు తేలింది. రైతు భరోసా, హంద్రీ–నీవా కాలువ పరిహారం డబ్బు తిమ్మయ్య ఖాతాలో జమయ్యాయి. డబ్బు కోసం కుమారుడు చంద్ర (47) తరచూ తండ్రితో గొడవ పడేవాడు.
గత నెల చంద్ర, అతని కుమారుడు సోమశేఖర్ జాయింట్ అకౌంట్‌కు రూ.1.07 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వకపోవడంతో ఈ నెల 11న చంద్ర తండ్రితో గొడపడి తాడుతో గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గొళ్లవాని చెరువు వద్దకు తీసుకెళ్లి చెట్టుకు వేలాడిదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. నిందితుడు చంద్రను బుధశారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.