యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 64 పట్టణాల్లో ఎక్స్‌క్లూజివ్ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ఆధార్ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ సంబంధిత సేవలు అన్నీ ఒకే చోటు పొందొచ్చు. దీని వల్ల ఆధార్ కార్డు కలిగిన వారికి ప్రయోజనం కలుగుతుంది. యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా ఆధార్ సెంటర్లు ఉన్నాయి. బ్యాంకులు, పోస్టాఫీస్‌లు, బీఎస్ఎన్ఎల్, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో దేశవ్యాప్తంగా ఆధార్ అప్డేట్ కేంద్రాలు పలు రకాల సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ 64 ఎక్స్‌క్లూజివ్ ఆధార్ సేవా కేంద్రాలు వన్‌స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఇక్కడికి వెళితే ఆధార్‌కు సంబంధించిన ఏ సర్వీస్ అయినా పొందొచ్చు. మరెక్కడికీ వెళ్లాల్సిన పని లేదు.
ఈ ఎక్స్‌క్లూజివ్ ఆధార్ సేవా కేంద్రాలను రాష్ట్రాల రాజధానులు, మెట్రోపాలిటన్ సిటీలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలో ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో ఈ ఆధార్ సేవా కేంద్రాలు నడుస్తున్నాయి. ఆధార్ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ సంబంధిత అన్ని సేవలను పొందొచ్చు. కొత్త ఆధార్ కార్డు పొందటం సహా ఆధార్ కార్డులో వివరాల అప్డేట్ వరకు అన్ని సేవలు వీటిల్లో లభిస్తాయి.
ఆధార్ సేవా కేంద్రాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేస్తాయి. అన్ని రోజుల్లోనూ ఆధార్ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్లి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. కాగా ఆధార్ కార్డును చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా చెప్పుకుంటారు. ఇది ఐడెంటిటీ కార్డుగా కూడా పని చేస్తుంది. ఇంకా పాన్ కార్డు పొందాలన్నా.. ఐటీఆర్ దాఖలు చేయాలన్నా.. ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ ఉండాల్సిందే. ఇలా ఆధార్ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి.