కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారం-6, 6బీ లో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఓ రిట్ పిటిషన్పై విచారణ సందర్భంగా.. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అండర్ టేకింగ్ సమర్పించింది ఈసీఐ. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్‌ను సమర్పించింది. ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో జత చేసినట్లు తెలిపింది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది. ఎన్నికల గుర్తింపుకార్డుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్రం గత ఏడాది జూన్‌లో ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022ని నోటిఫై చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేత నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అండర్ టేకింగ్‌ను సమర్పించింది. అండర్ టేకింగ్‌లో ఫారం 6, ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26బీ ప్రకారం ఆధార్ నెంబర్ సమర్పణ తప్పనిసరి కాదని తెలిపింది.