ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. అంతర్జాతీయ చిత్రాల్లో వినియోగించే మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ‘ఆదిపురుష్’ సినిమాలో ఉపయోగిస్తున్నట్లు ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు ఓం రౌత్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఓం రౌత్. స్క్రీన్‌పై విజువల్ వండర్లా ఉండేలా గ్రాఫిక్స్‌ను డిజైన్ చేయించుకుంటున్నారట. ఈ సినిమాకు దాదాపు 6వేలకు పైగా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) షాట్స్ అవసరమవుతున్నాయని బీ టౌన్ టాక్.
సినిమా కనువిందుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ‘ఆదిపురుష్’ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల చివర్లో ముంబైలో తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, సీత పాత్రలో కృతీ సనన్ కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది.