ఆరుషి త‌ల్లిదండ్రులు నిర్దోషులు

aarushi-hemraj-murder-case-

Posted October 12, 2017 at 18:11 

తొమ్మిదేళ్ల క్రితం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అరుషి హ‌త్య‌కేసులో అల‌హాబాద్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. అరుషి హ‌త్య‌కేసు దోషులుగా జైలులో శిక్ష అనుభ‌విస్తున్న ఆమె త‌ల్లిదండ్రులు రాజేశ్ త‌ల్వార్, నూపూర్ ల‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. కేసు పూర్వాప‌రాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల ఆరుషి 2008 మే 15న నోయిడాలోని ఆమె ఇంట్లోనే హ‌త్య‌కు గుర‌యింది. బెడ్ రూంలో ఆరుషి మృత‌దేహం ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉంది. మృత‌దేహాన్ని ప‌రిశీలించిన పోలీసులు గొంతుకోసి ఆమెను హత‌మార్చిన‌ట్టు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులు ఎవ‌ర‌న్న‌ది మొద‌ట పోలీసుల‌కు అర్ధం కాలేదు. కానీ ప్రాథ‌మిక విచార‌ణ త‌ర్వాత ఆరుషి త‌ల్లిదండ్రులు ప‌నిమ‌నిషి హేమ‌రాజ్ సాయంతో కూతురుని హ‌త్య‌చేశార‌ని కేసు న‌మోదుచేశారు. ఆరుషి హ‌త్య వెలుగుచూసిన త‌ర్వాత హేమ‌రాజ్ క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో అత‌డే ప్ర‌ధాన నిందితుడు అయిఉంటాడ‌ని పోలీసులు భావించారు. అయితే మ‌రుసటి రోజే ఆమె ఇంటి టెర్ర‌స్ పై హేమ‌రాజ్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆరుషి, హేమ‌రాజ్ ఇద్ద‌రూ చ‌నిపోయి ఉండ‌డంతో పోలీసులు దీన్ని ప‌రువుహ‌త్య‌గా తేల్చి రాజేశ్ ను అరెస్టు చేశారు.

బెడ్ రూంలో ఆరుషి, హేమ‌రాజ్ తో స‌న్నిహితంగా ఉండ‌డాన్ని చూసిన తండ్రి రాజేశ్ ఆవేశానికి గురై వారిద్ద‌రినీ హ‌త్య‌చేసిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌కు జాతీయ మీడియా విశేష ప్రాధాన్యం ఇస్తూ హ‌త్య‌లు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను ప‌దే ప‌దే ప్ర‌సారం చేసింది. కేసు ప్రాముఖ్య‌త దృష్ట్యా విచార‌ణను 2008 మేలో సీబీఐ చేప‌ట్టింది. ఏడాది పాటు విచార‌ణ జ‌రిపిన సీబీఐ అధికారులు రాజేశ్ స‌హాయ‌కుడు కృష్ణ‌, ప‌నిమ‌నుషులు రాజ్ కుమార్, విజ‌య్ ల‌ను నిందితులుగా పేర్కొన్నారు. అయితే స‌రైన ఆధారాలు చూప‌లేక‌పోవ‌డంతో 2009లో కేసును సీబీఐలోని మ‌రో బృందానికి అప్ప‌గించారు.

కొత్త ద‌ర్యాప్తు బృందం రాజేశ్ నే ప్ర‌ధాన నిందితుడిగా పేర్కొంది. కానీ రాజేశ్, ఆయ‌న భార్య నుపూర్ మాత్రం తాము అమాయ‌కుల‌మ‌ని చెబుతూ వ‌చ్చారు. కానీ త‌మ ఇంట్లో రెండు హ‌త్య‌లు ఎలా జ‌రిగాయో మాత్రం వారు చెప్ప‌లేక‌పోయారు. దీంతో ఆరుషిని త‌ల్లిదండ్రులే హ‌త్య‌చేశార‌ని నిర్ధారిస్తూ 2013లో సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. వారిద్ద‌రికీ జీవిత ఖైదు విధించింది. సీబీఐ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ రాజేశ్ , నుపూర్ అల‌హాబాద్ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై నాలుగేళ్ల పాటు విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇవాళ తీర్పు వెల్ల‌డించింది. సంద‌ర్భానుసార సాక్ష్యాల వ‌ల్లే ఈ కేసులో ఆరుషి త‌ల్లిదండ్రులను దోషులుగా తేల్చార‌ని, అంతేగానీ వారే హ‌త్య‌చేశార‌న‌డానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవ‌ని కోర్టు పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రాజేశ్ ను, ఆయ‌న భార్య‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. కేసులో ఆధారాలు స‌రిగ్గా లేన‌ప్పుడు నిందితుల‌కు అనుకూలంగా తీర్పించ్చేందుకు న్యాయ‌స్థానం క‌ల్పించిన వెసులుబాటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. హైకోర్టు తీర్పుతో రాజేశ్ దంప‌తులు జైలు నుంచి విడుద‌ల కానున్నారు. తొమ్మిదేళ్ల నుంచి వారు దాస్నాలో జైలు జీవితం గ‌డుపుతున్నారు. మ‌రోవైపు హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

SHARE