ఆటగదరా శివ రివ్యూ

AATAGADHARA SIVA Movie Review & Rating

“శివా, నీ ఆట నాతో ఆడిస్తున్నావు, నీ బరువు నాతో మోయిస్తున్నావు.” ఈ మాటల్లో ఎంత అంతరార్ధం ఉందో, ఈ ‘ఆటగదర శివ’ సినిమాలో కూడా అంతే అంతర అర్ధం ఉంది.

కథ :

ఉరి శిక్షకు రెడీగ ఉన్న బాబ్జి (ఉదయ్ శంకర్) జైలు నుండి తప్పించుకుంటాడు. అలాగే సెంట్రల్ జైలు లో ఉరి తీసే తలారి జంగయ్య (దొడ్డన్న)కి పై అధికారుల నుండి పిలుపు వస్తుంది. జంగయ్య ఆ పని మీద బయలుదేరగా మధ్యలో జైలు నుండి తప్పించున్న బాబ్జి తన జీప్ ఎక్కుతాడు. అయితే జంగయ్యకి బాబ్జినే నేరస్థుడని మొదట్లో తెలియదు. కొంత దూరం వెళ్లిన తరువాత పేపర్ ప్రకటనలో జంగయ్య బాబ్జి గురించి చూస్తాడు. తదుపరి వీరి ప్రయాణంలో ఒక ప్రేమ జంట (హైపర్ ఆది,తన ప్రేమికురాలు) కలుస్తారు. అలా వెళ్తున్న వారి రోడ్ ట్రావెల్ లో వారికి ఎన్నో ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. అయితే ఆ అనుభవాలేంటి, జంగయ్య బాబ్జిని పోలీసులకు అప్పగిస్తాడా లేదా అన్నదే అసలు కథ.

పరిశీలన :

ఆటగదరా శివ అనేది ఊహంచని జీవితానికి సంబంధించిన పాఠం. కన్నడలో హిట్ అయ్యి మంచి ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇక్కడ విభిన్న దర్శకుడు చంద్ర సిద్దార్థ ఆద్వర్యంలో ఊపిరి పోసుకుంది. టైటిల్ లోనే వైవిధ్యతను ప్రదర్శించిన దర్శకుడు కథలో కూడా అంతే వైవిధ్యతను ప్రదిర్శించాడు. రెగ్యులర్ ఫార్మట్ కి దూరంగా సాధారణ జీవితానికి దగ్గరగా ఉన్న కథను ఎంచుకొని తనదయిన శైలిలో సినిమాను మన ముందు ఉంచాడు. ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’, ‘మధుమాసం’, మరియు ‘ఇదీ సంగతి’ వంటి చిత్రాలతో చాలామందిని ఆకట్టిపడేసి, తన పేరు చూసి సినిమాకి వెళ్లే స్థాయికి ఎదిగాడు. సర్వసాధారణ జీవితంలో జరిగే ఆకస్మిక మార్పుల వాళ్ళ ఏర్పడే బంధాల గురించి చక్కగా చూపించారు ఈ సినిమాలో. అయితే ఎంత మన మధ్యన జరిగే వాటి గురించి అయిన మన మధ్యన జరిగినట్టు ఉంటేనే చూడడానికి అనువుగా ఉంటుంది, కానీ మనిషి జీవితానికి దగ్గరగా ఉన్న భావాలతో కూడిన ఈ సినిమా మనుషులకు దూరంగా ఉన్న ప్రాంతాల నేపధ్యంలో సాగడం చూడడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు. కానీ, కథకి తగ్గట్టు కథనం జరగాలి కాబట్టి ఇది ఒప్పుకోవలసినదే. ఒక లైన్ ని మూలంగా తీసుకొని అద్భుతంగా  తీసిన ఆ నలుగురు, అందరి బంధువయాకి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇవి మన పరిసరాలలో మన మధ్యన కథలల ఉండడం, కలర్ ఫుల్ గా ఉండడం కానీ ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండడం అన్నది ఒక పాయింట్. కన్నడలో ఇదే తరహాలో వచ్చిన తిథి సినిమా దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది. హిందీలో వచ్చి జాతీయ అవార్డు గెలుచున్న న్యూటన్ సినిమా కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. అలాగే ఈ సినిమా సాదాసీదాగా ఉన్నా కూడా, విషయం ఉన్న సినిమాగా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. మనవాళ్ళు ఇలాంటి సినిమాలకు అలవాటు పడడానికి టైం పట్టొచ్చు.

చంద్ర సిద్దార్థ తన ముందు సినిమాలతో సందేశాన్ని ఇచ్చినా, కామెడీ అనే ఎలిమెంట్ మిస్ కాలేదు. అదేవిధంగా, ఈ సినిమాలో కూడా హాస్యాన్ని బాగానే పండించారు. దీనికి హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకి చంటీలను వీలయినంతగా వాడుకున్నారు, హైపర్ ఆది మార్క్ డైలాగ్స్ బాగా ఎంటర్టెయిన్ చేస్తాయి. కథనం నెమ్మదిగా సాగుతూ ఉన్న కథకి తగ్గట్టుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. గతంలో వచ్చిన అర్జునరెడ్డిది కూడా స్లో స్క్రీన్ ప్లే అయినా కథకి అదే సరియైనది. ఏదిఏమయినా, ఆటగదరా శివ, చంద్ర సిద్దార్థ్ ముందు సినిమాలలోలాగా సందేశం ఇవ్వదు గానీ, నీలో ఉన్న వాడిని తట్టి లేపుతుంది. థియేటర్ నుండి బయటకు రాగానే చాలా ఆలోచనలను రేకెత్తిస్తుంది, అలాగే కొన్ని బంధాల గురించి ఆలోచించేలా తలను తడుతుంది. ఇక పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. కొత్త నటుడైన ఉదయ్ శంకర్, కన్నడ నటుడైన దొడ్డన్న చాలా నేచురల్ గ చేసారు.

ప్లస్ పాయింట్స్ – కథ, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, హైపర్ ఆది కామెడీ, పాటలు

తెలుగు బులెట్ రేటింగ్ – 3/5

తెలుగు బులెట్ పంచ్ లైన్ – “ఈ శివుడి ఆట ఎంత మందికి అర్ధమవుతుందో….!”

– గణేష్ గుల్లిపల్లి