కొత్తపలుకు…కొత్తగా…కేసీఆర్ రాజకీయ ఆత్మహత్య సాక్షిగా…!

KCR Full Speech At Paleru Public Meeting

‘కొత్తపలుకు నా సంతృప్తి కోసం రాస్తున్నాను… ఓపెన హార్ట్‌ విత ఆర్కే జనం కోసం నిర్వహిస్తున్నా’నని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరక్టర్‌ వేమూరి రాధాకృష్ణ అప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తు అయితే ప్రతీ ఆదివారం “కొత్తపలుకు” పేరుతో ఆయన స్వయానా రాసే ఆర్టికల్ రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవారిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే అందులో సునిశిత విశ్లేషణ ఉటుంది. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం నుంచి సందర్భానికి తగ్గట్లుగా కొత్త కొత్త విషయాలు చెబుతూ ఉంటారు. వ్యాసాల్లో కాస్తంత టీడీపీ అనుకూలత కనిపిస్తుందని ఇతర పార్టీల నేతలు బహిరంగంగానే చెబుతూ ఉంటారు. అయితే తెలంగాణా ఎన్నికలకు వెళ్ళడానికి కేసీఆర్ చేసిన అసెంబ్లీ రద్దు తర్వాత రాసిన “కొత్తపలుకు” మాత్రం కాస్తంత తేడాగా ఉంది. అది తెలంగాణ ఎన్నికల విషయంలో చంద్రబాబు అడుగుల్ని నిర్దేశించేలా హెచ్చరించేలా బెదిరించేలా ఇలా ఇన్ని కోణాల్లో ఆ ఆర్టికల్ ఉంది. అంతే కేసీఆర్ అంటే అజేయుడు ఆయన జోలికి పోవడం మంచిది కాదన్నట్లుగా సలహాలు కూడా ఇచ్చేశారు. ఒక్కసారిగా టీడీపీపై నుంచి ఆయన అభిమానం.. టీఆర్ఎస్‌ మీదకు అలా వెళ్లిపోయిందేమిటి చెప్మా అని చాలా మందికి డౌటానుమానాలు కూడా కలిగాయి. అయితే అప్పటి “కొత్తపలుకు” మొత్తం కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కట్టకూడదనే సూచనలతోనే సాగిపోయింది.

kcr-abn

అంతకు మించి అలా జతకట్టి మహాకూటమి ఏర్పాటు చేసినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరని అప్పట్లో ఆయన తీర్పిచ్చేశారు. కేసీఆర్ గెలవడం ఖాయమని నిర్దారించేశారు. అలా చేయడం వల్ల తనను ఓడించడానికి ప్రయత్నించారన్న కారణంగా తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఏపీలో కేసీఆర్ కలుగజేసుకుని.. చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నిస్తారని మోడీ, కేసీఆర్, జగన్, పవన్ లు కలసి చంద్రబాబును ఓడిస్తారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా వచ్చ్హిన కొత్తపలుకుని చూసి ఇదంతా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్‌కు ఎక్కడ నష్టం జరుగుతుందో అన్న కంగారుతో చంద్రబాబును ఆ దిశగా ముందడుగు వేయకుండా చేసేందుకు… సలహాలతో కూడిన.. హెచ్చరికలతో నిండిన బెదిరింపుల్లాగా అనిపించింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ఎనభై సీట్లు వస్తాయని సదరు ఆర్టికల్‌లో తేల్చేశారు. ఏమేమి సర్వేలు చేశారో కానీ ప్రజలు కేసీఆర్‌వైపే ఉన్నారట. టీడీపీ తరపున ఎవరైనా గెలిచినా టీఆర్ఎస్‌లో చేరరని గ్యారంటీ ఏమిటని మరో సందేహం. ఇలా ఒకరకంగా టీడీపీకి స్పష్టమైన హెచ్చరికలే చేశారు ఆయన.

kotha-palukulu

కానీ అదేమిటో ఆయన కొత్త పలుకుల్లో రెండు వారాల్లోనే స్పష్టమైన మార్పు వచ్చింది. ముందు రాసిన “కొత్త పలుకు”లో మహాకూటమిలో భాగం కావొద్దని చంద్రబాబును బెదిరింపులతో కూడిన బ్లాక్‌మెయిల్ చేసిన ఆర్కే తెలంగాణలో కేసీఆర్‌కు ఏ విధంగా చూసినా 80 అసెంబ్లీ సీట్లు ఖాయమని తీర్పిచ్చేశారు. కానీ రెండో వారం “కొత్త పలుకు”లో మాత్రం పూర్తిగా స్వరం మార్చారు. తన బెదింపులతో కూడిన బ్లాక్‌మెయిళ్లను చంద్రబాబు ఏ మాత్రం ఖాతరు చేయకుండా మహాకూటమిలో టీడీపీ భాగం కావడంతో పాటు వ్యూహాలు మొత్తం తనే పన్నుతూండటంతో ఆర్కేకు అసలు విషయం అర్థమైపోయినట్లుంది. అదేమిటంటే ఒక వేళ మహాకూటమిలో భాగం కాకుండా టీఆర్ఎస్‌కు సేఫ్ పాసేజ్ ఇచ్చేస్తే కేసీఆర్ మరింత బలపడతారని ఏపీ ఎన్నికల్లో మోడీతో కలిసి కచ్చితంగా ఇబ్బంది పెడతారని చంద్రబాబు అంచనా వేసి కేసీఆర్‌ను ఎంతో కొంత బలహీనం చేసే ఉద్దేశంతో మహాకూటమిలో చేరారట. కేసీఆర్‌ బలహీనం చేస్తే ఆటోమేటిక్‌గా మోడీ కూడా బలహీనపతారనేది చంద్రబాబు అంచనా అని ఆర్కే మార్క్ విశ్లేషణ. మరి ఈ మాత్రం అంచనా వేయకుండా.. రెండు వారాల కిందట.. మహాకూటమిలో టీడీపీ చేరవద్దని.. అలా చేస్తే.. కేసీఆర్ ఏపీలో చంద్రబాబును ఓడిస్తారని.. బెదిరించడం ఎందుకు..? అయితే ఇదంతా దాదాపు నెల కిందటి సంగతి తాజాగా నిన్న వచ్చిన కొత్త పలుకు వింటే మీ మైండ్ కాసేపు పనిచేయదు.

radha-krishna

ఎందుకంటే నిన్నటి కొత్త పలుకు లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని తేల్చేశారు. రాజకీయాల్లో హత్యలుండని.. ఆత్మహత్యలుంటాయని… కేసీఆర్.. పరిస్థితి అదేనని తేల్చేశారు. మహాకూటమి అభ్యర్థుల్ని ప్రకటించకుండానే… ప్రచారం ప్రారంభించకుండానే… టీఆర్ఎస్‌తో పోటాపోటీగా ఉందని తేల్చేశారు. గులాబీ దళం పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అరవై ఐదు శాతం సానుకూలత కరిగిపోయిదంని కూడా తీర్పు నిచ్చారు.అంటే మరి నేరుగా కేసీఆర్ ఓడిపోతున్నారని చెబితే ఆయనకు కోపం వస్తుందని అనుకున్నారేమో అందుకే ఈసారి పోటాపోటీగా ఉందని చెప్పారు. కానీ అనేక వ్యాఖ్యలతో కేసీఆర్ గ్రాఫ్ పడిపోయి ఆయన ఓడిపోతున్నారని తేల్చారు. కేసీఆర్‌లో అహంకారం పెరిగిపోయిందని అలాంటి అహంకారాన్ని తెలంగాణ ప్రజలు ఏమాత్రం అంగీకరించబోరన్నరు. ఈ సందర్భంలో కేబినెట్ మొత్తాన్ని డిస్మిస్ చేసిన ఎన్టీఆర్‌ను కల్వకుర్తిలో ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరగోబోతోందన్నట్లుగా తన కొత్తపలుకుల్లో ఆర్కే తేల్చేశారు.

cm-kcr-meet

గతంలో కొత్త పలుకులో తను రాసిన దాన్ని గుర్తు తెచ్చుకుని నెలలోనే ఇంత మార్పా అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. అయితే మొత్తం కేసీఆర్ అధికారాన్ని పోగొట్టుకోవడానికి కారణం స్వయంకృతమేనని తేల్చారు. చంద్రబాబు పొత్తు కోసం ముందుకు వచ్చి పార్టీని నమ్ముకున్న ఆరేడుగురు నేతలకు టిక్కెట్లు మాత్రమే అడిగారని కేసీఆర్ అవి కూడా ఇవ్వలేదని చంద్రబాబు అందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చినట్లు తేల్చారు. అలాగే ఒకరకంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న కూటమి ప్రయత్నాలు సీరియస్‌గా మారడానికి కూడా.. కేసీఆర్ చేసిన ఆ తప్పే కారణమని ఆర్కే చెబుతున్నారు. టీఆర్ఎస్ పొత్తుకు అంగీకరించి ఉన్నట్లయితే దేశంలో బీజేపీయేతర కూటమి కోసం చంద్రబాబు సీరియస్‌గా ప్రయత్నించేవారు కాదేమోనని ! కానీ ఇప్పుడు అనివార్యంగా కీలక పాత్ర పోషించాల్సి వస్తోందని చెబుతున్నారు. మొత్తానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కేసీఆర్‌ విషయంలో తను చెప్పిన జోస్యాన్ని నాలుగు వారాల తర్వాత తనే కొట్టిపారేయడం ఇప్పుడు తెలంగాణా వర్గాల్లో ముఖ్యంగా తెరాస శ్రేణులను పూర్తి నిరాశలోకి నెట్టేసింది.

kcr-cm