‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’లో లక్ష్మిపార్వతిపై వర్మ క్లారిటీ

RGV Bhairava Geetha Movie Postponed

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి కౌంటర్‌గా తాను ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తానని, అంతేకాకుండా ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని క్రిష్‌ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రంతో పాటే విడుదల చేస్తాను అని ఇప్పటికే ప్రకటించాడు. కానీ ఈ చిత్రం ఇంకా సెట్స్‌ మీదకు వెళ్లలేదు. దాంతో వర్మ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ వర్మ మాత్రం తాను తప్పకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాను అని చెబుతున్నాడు. గతకొంత కాలంగా ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలో కీలక పాత్ర అయిన లక్ష్మి పార్వతి కోసం మోడల్‌ రూపాలిని వర్మ ఎంపిక చేశాడని, అందుకు ఒప్పందం కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వర్మ ఈ వార్తలపై స్పందించాడు.

Lakshmi's NTR

లక్ష్మి పార్వతి కోసం మోడల్‌ రూపాలిని ఎంపిక చేశామంటూ ఒక వర్గం మీడియా గతకొంత కాలంగా జోరుగా ప్రచారం చేస్తోంది, కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, లక్ష్మి పార్వతి పాత్ర కోసం రూపాలిని అసలు సంప్రదించనేలేదు. మా భాగస్వాములలో ఒకరి భార్యకు రూపాలి స్నేహితురాలు కావడంతో ఆమెను కలవడం జరిగింది తప్పా ఆమెకు ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి ఏ సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రకు ఎంపిక జరిగిపోయింది. మిగతా నటీనటుల కోసం వర్మ గాలిస్తునట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్‌ మీదకు తీసుకెళతాను అని వర్మ చెప్పుకొచ్చాడు. లక్ష్మి పార్వతి కోసం ఎవరిని సంప్రదిస్తున్నాడు, ఎవరైనా ఫిక్స్‌ అయ్యారా అనేది మాత్రం వర్మ బయటపెట్టలేదు.