మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శివాజీ నగర్‌లోని గోవండి ప్రాంతంలో ఒక భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 7 గురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించినట్లు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదే విధంగా, స్థానికుల సహయంతో క్షతగాత్రులను దగ్గరలోని రాజవాడి, సియోన్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరిని నేహషేక్, మోకర్ షేక్‌లుగా గుర్తించారు. మరికొందరిని అత్యవసర చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
కాగా, పోలీసులు సంఘటన స్థలం వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. అయితే, వర్షం బీభత్సంగానే భవంతి కూలీపోయి ఉంటుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బిఎంసీ) అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.