రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తువారిపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఝలావర్ జిల్లాలో చోటుచేసుకుంది. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు ఉండటం బాధాకరం. మాండవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలోని ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది.
భార్యభర్తలు ముఖేశ్, సీతాబాయ్ వారి ముగ్గురు పిల్లలు పవన్, కమలేశ్, నిర్మలాలు ఈ ప్రమాదంతో మృత్యువాతపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఝలావర్ ఆస్పత్రికి తరలించారు.
ఘాటోలికి చెందిన ముఖేశ్, అతడి భార్య సీతాబాయ్, పిల్లలు బడ్బేలీలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా రోడ్డు పక్కనే ఓ గుడిసెను నిర్మించుకుని ఉంటున్నారు. బుధవారం రాత్రి వీరంతా గుడిసెలో నిద్రిస్తుండగా.. కంకర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ప్రమాద సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉంటాడని భావిస్తున్నారు.