ఇద్దరు యువకులు తమ కుటుంబంలోని మహిళ ఓ యువకుడితో పారిపోవడానికి సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలోకి యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె చూపు కోల్పోయే పరిస్ధితి లేదని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఆమె చిత్రకూట్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల ప్రకారం.. బాధితురాలు పన్నా జిల్లాలోని బార్హో గ్రామంలో నివసిస్తుంది. ఆ ఊర్లోని ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడాలని పిలివడంతో ఆమె తన సోదరుడితో కలిసి వారి ఫాంహౌస్‌కు వెళ్లింది. నిందితులు ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి, బాలికను వేధించి ఆమె కళ్లలోకి యాసిడ్ పోశారు. ఆ తర్వాత ఆమె బాధతో కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బాలిక నొప్పితో వణుకుతూ పొలంలో పడిపోయింది.
బాలిక పరిస్థితి చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. ఈ ఘటన సిగ్గుచేటని నిందితులపై కఠినచర్యలు చేపట్టాలని, బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. బాలికకు ఆమె తోబుట్టువులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.