వ్యవసాయం చేస్తూ లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సీనియర్ నటుడు నరేశ్. తాజాగా అతడు తన ఫాంహౌస్‌లో పండిన పండ్లను స్వయంగా అమ్మాడు. తోటలో విరగకాసిన మామిడి, నేరేడు పండ్లను స్వహస్తాలతో తెంపి తన కార్యాలయానికి తీసుకొచ్చాడు. అక్కడ వాటిని కిలో రూ.50 చొప్పున అమ్మి 3,600 రూపాయలు సంపాదించాడు.
అయితే నటుడిగా సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటే వచ్చే సంతోషం కన్నా వీటిని అమ్మినందుకు పొందిన ఆనందమే ఎక్కువగా ఉందని నటుడు చెప్పుకొచ్చాడు. కష్టపడి వ్యవసాయం చేయడంలోనే అసలు సిసలైన మజా ఉందంటున్నాడు. అతడు పండ్లు అమ్మిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నరేశ్ చివరిసారిగా ‘శ్రీకారం’, ‘రంగ్‌దే’ చిత్రాల్లో కనిపించాడు. ప్రస్తుతం అతడు ఆలీతో కలిసి ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమాలో నటిస్తున్నాడు.