క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బ్రయాన్

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బ్రయాన్

ఎమ్మీ అవార్డు గ్ర‌హీత ‘బ్రేకింగ్ బ్యాడ్’ స్టార్ బ్రయాన్ క్రాన్స్టన్ క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ మేరకు గురువారం ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇత‌రుల‌కు ఉప‌యోగ‌పడుతుంద‌నే ఆశ‌తో త‌న ప్లాస్మాను దానం చేశాన‌ని వెల్లడించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న బ్లడ్ అండ్ ప్లాస్మా సెంటర్‌లో ప్లాస్మా దానం చేసిన‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా క్రాన్స్టన్ మాట్లాడుతూ.. ‘కొంచెం త‌ల‌నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉండ‌టంతో ప‌రీక్ష‌లు చేయిస్తే క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ స‌మ‌యంలో రుచి, వాస‌న స్వ‌భావాన్ని కోల్పోవ‌డం గ‌మ‌నించాను. నేను చాలా అదృష్ట‌వంతుడిని. మీ అంద‌రి ఆశీర్వాదాల వ‌ల్ల చాలా తొంద‌ర‌గానే క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను. ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి భౌతిక దూరం పాటించాల‌ని కోరుతున్నాను’ అన్నారు. 2008 నుంచి 2013 వ‌ర‌కు సాగిన టీవీ డ్రామా.. ‘బ్రేకింగ్ బ్యాడ్‌’లో కెమిస్ట్రీ టీచర్‌గా త‌న అద్భుత న‌ట‌న‌కు గానూ క్రాన్స్టన్.. ఎమ్మీ అవార్డుల‌ను అందుకున్నారు. టెలివిజ‌న్ రంగంలో అద్భుత ప్ర‌తిభ క‌లిగిన న‌టీన‌టుల‌కు ఎమ్మీ అవార్డులతో స‌త్క‌రిస్తారు.