శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం దొరకక శానిటైజర్ తాగి ఏకంగా ఏడుగురు మరణించారు. కరోనా నేపథ్యంలో 10 రోజులుగా కురిచేడులో మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో స్థానికులతో పాటు కొందరు యాచకులు నాటుసారా, శానిటైజర్ తాగుతున్నారు. కొందరైతే శానిటైజర్‌లో సారా కలుపుకుని మరీ తాగేస్తున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో అందరిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో గురువారం ముగ్గురు మరణించగా, ఇవాళ మరో నలుగురు చనిపోయారు. మద్యం ధరలు పెరగడంతోనే చాలా మంది నాటు సారాకి బానిసవుతున్నారు. అది కూడా దొరకకపోతే కొందరు శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.