అక్కినేని గారి ఇల్లుని రోడ్డుమీద నుంచే దండం పెట్టుకునేదాన్ని: నటి రేఖ

అక్కినేని గారి ఇల్లుని రోడ్డుమీద నుంచే దండం పెట్టుకునేదాన్ని: నటి రేఖ

రేఖ మ‌న తెలుగ‌మ్మాయే. తెలుగు సినిమాతోనే న‌టిగా కెమెరా ముందుకొచ్చారు. కానీ క్ర‌మంగా బాలీవుడ్ కి వెళ్లి, అక్క‌డి తార‌గా చ‌ల‌మాణీ అయ్యారు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగులో న‌టించాల‌న్న ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఏఎన్నార్ జాతీయ అవార్డు 2019 అందుకోవ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చారామె. అవార్డు అందుకున్న త‌ర‌వాత త‌న ఆనందాన్ని పంచుకున్నారు. తెలుగులో మ‌ళ్లీ న‌టించాల‌నివుంద‌ని, తెలుగులో ఓ సినిమా చేయాల‌న్న‌ది త‌న అమ్మ చివ‌రి కోరిక‌ని చెప్పారామె. అక్కినేనితో త‌న‌కున్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు.

తాను చూసిన తొలి సినిమా `సువ‌ర్ణ సుంద‌రి` అని, ఆ సినిమాతోనే సినిమా గురించిన విష‌యాలు తెలిశాయ‌న్నారు. “అన్న‌పూర్ణ స్డూడియో నా ఇల్లు లాంటిది. ఇక్క‌డ దాదాపు ప‌దేళ్లున్నాను. ఇక్క‌డి ప్ర‌తి మొక్క‌తో, చెట్టుతో నాకు అనుబంధం ఉంది. షూటింగ్ అయ్యాక బంజారా హిల్స్ వైపుగా వెళ్తుంటే అక్కినేని గారి ఇల్లు క‌నిపించేది. రోడ్డుమీద నుంచే దండం పెట్టుకునేదాన్ని. లోప‌ల‌కు ఎప్పుడు వెళ్తానో అనిపించేది. న‌న్ను ఓసారి అక్కినేని భోజ‌నానికి ఆహ్వానించారు. ఎన్నో విలువైన విష‌యాలు చెప్పారు. ఆరోగ్య సూత్రాలు బోధించారు” అని చెప్పుకొచ్చారామె.

నాగ్ గొంతులో అక్కినేని, శ్రీ‌దేవి, రేఖ బ‌యోగ్ర‌ఫీ నాగార్జున వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్టు అవ‌తారం ఎత్తారు. అక్కినేని, శ్రీ‌దేవి, రేఖ‌ల పై రూపొందించిన ప్ర‌త్యేక‌మైన ఏవీల‌కు ఆయ‌న గొంతు అందించారు. అక్కినేని జాతీయ అవార్డు ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఈరోజు హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగింది. సాధార‌ణంగా అవార్డు గ్ర‌హీత‌ల కోసం ఏవీల‌ను రూపొందించ‌డం, వాటికి వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్టుల‌తో చెప్పించ‌డం మామూలే.

ఏవీలు చెప్ప‌డానికే కొంత‌మంది ప్ర‌త్యేక డ‌బ్బింగ్ క‌ళాకారులు ఉంటారు. అయితే ఈసారి ఏవీల‌కు అక్కినేని నాగార్జున స్వ‌యంగా వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. నాగ్ గొంతులో ఏఎన్నార్ జీవిత విశేషాలు విన‌డం హృద్యంగా అనిపించింది. అంతే కాదు ఈ కార్య‌క్ర‌మాన్ని సైతం ఆయ‌న ముందుండి న‌డిపించారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, బిగ్ బాస్ ల‌తో వ‌చ్చిన అనుభ‌వం ఏమో కార్య‌క్ర‌మాన్ని ఆసాంతం హాయిగా సాగేలా చేశారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో రేఖ‌ను కొన్ని ప్ర‌శ్న‌లు కూడా అడిగి స‌మాధానాలు రాబ‌ట్టారు.