అగ్రిమెంట్ మార్చి రాశాం…అయితే ఏంటి …శివాజీ వీడియో సందేశం ?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీకి సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ సర్య్కులర్ జారీ చేశారు. ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని..విచారణకు హాజరుకాలేమని రవిప్రకాశ్, శివాజీ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం పంపారు. విచారణకు హాజరయేందుకు మరో 10 రోజులు గడువు కావాలని కోరారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు..ఈ మేరకు లుక్ ఔట్ సర్య్కులర్ జారీచేశారు. గత కొన్నిరోజులుగా రవిప్రకాశ్, శివాజీ ఆచూకీ తెలియకపోవడంతో వీరిద్దరూ ఫలానా ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ఓ వీడియో ద్వారా తెరపైకి వచ్చారు. శివాజీ ఎక్కడికీ పారిపోలేదని, శివాజీ వెన్నుచూపే వ్యక్తికాదని ఆ వీడియోలో వివరించారు. “శివాజీ పారిపోయాడు” అని ప్రచారం చేసే మీడియాలోని ఓ వర్గం కోసం ఈ వీడియో రూపొందించలేదని, తన బాణీ వినపించడానికే రూపొందించానని తెలిపారు. “ఇది రవిప్రకాశ్ కు నాకూ మధ్య ఉన్న విషయం. షేర్ల విషయంలో ఉన్న పంచాయితీ ఇది. ఈ సివిల్ పంచాయితీని కాస్తా క్రిమినల్ వ్యవహారంగా మార్చడానికి మధ్యలో ఈమెయిల్స్ తీసుకొచ్చారు. డిలీట్ చేసిన ఈమెయిల్స్ రికవర్ చేసినవాళ్లకు అందులో లేని పదాలను యాడ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదో కుట్ర. 2018 ఫిబ్రవరిలో నాకూ రవిప్రకాశ్ కు మధ్య అగ్రిమెంట్ జరిగింది. అదే ఒప్పందాన్ని ఇటీవలే తిరగరాసుకున్నాం. ఇది సాధారణమైన విషయమే. సంస్థలోకి కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా ప్రయోజనాలను కాపాడుకునేందుకు నేను ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఈ విషయంలో ఏదో జరిగిపోతోందని చెబుతూ కౌశిక్ రావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్లు మా ఇంటి మీద పడిపోయి మావాళ్లందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి ఇల్లంతా వెదికి ఏమీ దొరకలేదని సంతకం పెట్టించుకుని వెళ్లిపోవడం.. ఏమిటిదంతా!” అంటూ మండిపడ్డారు. తాము సెటిలర్లం కాబట్టి, తమకు స్థానబలం లేదని తమపై హైదరాబాదు పోలీసులు కేసులు పెట్టి లోపల వేసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.