నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి భామ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ట్వీట్స్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వేతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆమె విడాకులపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో హాట్‌టాపిక్‌గా మారింది. పూనమ్ విడాకుల అంశంపై ఆసక్తికరంగా ప్రశ్నలు లేవనెత్తుతూ ఇలా రాసుకొచ్చింది.
‘విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా? లేదంటే ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు.. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?’ అని ఆమె పేర్కొంది. అయితే ఈ ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే పూనమ్ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. దీంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది? ఎందుకు డిలీట్ చేసింది? ఇప్పుడు ఆమె విడాకుల అంశంపై ఇంత లోతుగా స్పందించడమేంటని నెటిజన్లు ఆమె పోస్ట్‌లోని ఆంతర్యం వెతికే పనిలో పడ్డారు.