వారిద్దరూ బంధువులే.. వరుసకు బావా మరదల్లే.. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు విషయం చెప్పారు. మూడు నెలలుగా కలిసి ఉంటున్నారు. అయితే పెళ్లి విషయంపై పెద్దలు ఎటూ తేల్చకపోవడంతో మనస్తాపం చెందారు. బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్‌గావ్‌లో జరిగింది. నార్నూర్ సీఐ ప్రేమ్‌కుమార్ కథనం ప్రకారం..
నార్నూర్ మండలం చోర్‌గావ్ గ్రామానికి చెందిన సీడాం మారు నిర్మల్ జిల్లా పెంబి మండలం పస్పుల గ్రామానికి చెందిన ఆత్రం రాంబాయి వరుసకు బావా మరదళ్లు. మారు తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో అతని వేనమామ పస్పుల గ్రామానికి చెందిన చిన్నభీమ చోర్‌గావ్ గ్రామంలోనే మారుకు పాలేరుగా పనికి కుదిర్చారు. ఈ క్రమంలో మేనమామ కూతురు రాంబాయి తరచూ మారు ఇంటికి వచ్చి వెళ్లేంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని రాంబాయి తల్లి దండ్రులకు చెప్పారు.
వారు తమ నిర్ణయం చెప్పకపోవడంతో రాంబాయి మూన్నెళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి మారుతో కలిసి చోర్‌గావ్‌లో ఉంటోంది.అయినా పెళ్లిపై పెద్దల నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో మనస్తాపం చెందారు. పెళ్లి చేసుకున్నా కలిసి జీవించలేమనుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లోనే దూలానికి ఉరివేసుకున్నారు. ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో గ్రామస్తులు తలుపు తీసి చూడడంతో ఇద్దరూ చనిపోయి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ ప్రేమ్‌కుమార్, ఇన్‌చార్జి ఎస్సై ఇమ్రాన్ ఘటన స్థలానికి చేరుకుని çపంచనామా నిర్వహించారు. మారు అన్న సిడాం కన్నిరాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై తెలిపారు.